సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు ఎక్కడ ?…సమన్వయ కమిటీ చైర్మన్ అలువాల శ్రీనివాస్ తీవ్ర విమర్శలు.

0
1009986736

సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు ఎక్కడ..?
పదవుల కోసం వచ్చిన వారికి ప్రాధాన్యం.. పార్టీ కోసం శ్రమించిన వారికి నిర్లక్ష్యమా..?
పెద్దనాగారం బూత్ లెవెల్  కమిటీ సమావేశంపై అలువాల శ్రీనివాస్ తీవ్ర విమర్శలు


నర్సింహులపేట, జూలై 1 (నమస్తే న్యూస్)

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారం గ్రామపంచాయతీ పరిధిలో ఇటీవల నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల కమిటీ సమావేశంలో సీనియర్ కార్యకర్తలను విస్మరించడం తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ఈ అంశంపై సమన్వయ కమిటీ చైర్మన్ అలువాల శ్రీనివాస్ ఘాటుగా స్పందిస్తూ పార్టీ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు.పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా అహర్నిశలు శ్రమించి, కష్టకాలంలోనూ కాంగ్రెస్ జెండాను భుజాన మోసిన సీనియర్ నాయకులకు కనీస గుర్తింపు, గౌరవం కూడా దక్కకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి వెన్నెముకగా నిలిచిన కార్యకర్తలను పక్కనబెట్టి, కొత్తగా పదవుల కోసం వచ్చిన వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం సరైన విధానం కాదన్నారు.ప్రస్తుతం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం రెండు వర్గాలు పోటీ పడుతున్న నేపథ్యంలో, పార్టీని కష్టకాలంలో నిలబెట్టిన సీనియర్ కార్యకర్తల అభిప్రాయాలకు విలువ లేకుండా పోయిందని విమర్శించారు. పార్టీ జెండాను భుజాన మోసిన నాయకుల కంటే పదవుల కోసం డబ్బును పెట్టుబడిగా పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన వారికి ఎక్కువ గౌరవం దక్కుతోందని ఆరోపించారు.స్వపక్షంలోనే పక్షపాత ధోరణి కొనసాగుతోందని, దీని వల్ల కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని అలువాల శ్రీనివాస్ పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేసిన సీనియర్ నాయకులను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో పార్టీపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.ఇప్పటికైనా పార్టీ అధిష్టానం స్పందించి, సీనియర్ కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించడంతో పాటు అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని అలువాల శ్రీనివాస్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share with